ఏపీపీఎస్సీ
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను ఇటీవల కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు
లక్ష మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అయితే జనవరి 5న జరుగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. నేడో రేపో మెగా
డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే
ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు
నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా
వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా
కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ
అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే జనవరి 5న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు తెలియజేస్తూ
అక్టోబర్ 30న ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ
నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్ 2 వాయిదా వేస్తే ఏప్రిల్ లేదా మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలుంటుంది. ఏప్రిల్ వరకు పరీక్ష కేంద్రాలన్నీ బిజీ ఉంటాయి. కాబట్టి
మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. అయితే డీఎస్సీ రాత పరీక్షల తేదీలు అనుసరించి
గ్రూప్ 2 తేదీ మార్చాలా.. వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు
సూచన ప్రాయంగా తెలిపాయి.